దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే మరో రూ.33 తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు నుంచి జీఎస్టీ కౌన్సిట్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ ఛైర్మన్ వివేక్ దెబ్రోయ్ ఈ అంశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుందని సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జీఎస్‌టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా సంతోషమేనని, అయితే రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. అందుకే పెట్రోల్ ధర కొండెక్కి కూర్చుంది. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించినా తమకు రాబడి తగ్గుతుందని చాలా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించడంలేదు. ఒకవేళ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ఆ మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు. అదే జరిగితే మొత్తానికే జీఎస్టీ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.