నిజామాబాద్- జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో ప్రజా పాలన దరఖాస్తుల పనితీరును మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. దరఖాస్తు కేంద్రాల్లో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోందని, ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా, బుద్ది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని, ఆరు గ్యారెంటీలను 100 రోజల్లో అమలు చేసి తీరుతాం, 100 రోజుల్లో అమలు చేయకపోతే అప్పుడు అడగండన్నారు.
రాష్ట్రంలో గడిలపాలన అంతమైంది, ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయామని దొరలకు నిద్రపట్టడం లేదు, ఆ ప్రస్టేషన్‌లో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. త ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం…అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత పాలకుల మాదిరి తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనే అంత దరిద్రపు ఆలోచనలు తమకు లేదన్నారు.