ప్రముఖ టూత్‌పేస్ట్ సెన్సోడైన్ కంపెనీకి సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టూత్‌పేస్ట్ కంపెనీ ప్రకటన ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. వారం రోజుల్లో ఈ టూత్‌పేస్ట్‌కు సంబంధించిన యాడ్‌ను నిలిపివేయాలని కంపెనీని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సెన్సోడైన్ కంపెనీకి రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది.
టీవీల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై ప్రసారమవుతున్న సెన్సోడైన్ ప్రకటనలను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు సిఫారసు చేస్తున్న నంబర్‌వన్ టూత్ పేస్ట్ అంటూ ప్రకటన ఇచ్చుకోవడంపై సీసీపీఏ వివరణ కోరింది. ఏ ఆధారాలతో ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు ఈ పేస్టును సిఫారసు చేస్తున్నారో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మన దేశంలో దంతవైద్యుల అభిప్రాయలు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు ఈ పేస్టును సిఫారసు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసుకోవడమేంటని నిలదీసింది.