CM YS Jagan: సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. నిన్న మూడో రోజున మూడు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. మలి విడత ప్రచారంలో డోస్ పెంచేసారు సీఎం జగన్. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో.. ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Chandrababu: దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. అటువైపున కౌరవ సైన్యం ఉందన్నారు. అందరిని మోసం చేసిన చరిత్ర కూటమిది అంటూ టీడీపీ, జనసేన, బీజేపీపై మండిపడ్డారు. ఈ మధ్య చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని గుర్తుచేస్తూనే.. ఆ కామెంట్స్‌కు కౌంటరిచ్చారు జగన్. సిద్ధం, మేమంతా బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్… ఇప్పుడు మలి విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రేపు(మే 1) బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 1వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో మెయిన్ రోడ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్.