Sarfaraz Khan React on IND vs BAN Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కావాలంటే బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలు యువ క్రికెటర్లకు మంచి అవకాశం. ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుర్రాళ్లకు మద్దతుగా నిలుస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని ట్రోఫీలు ఆడినా తనకు తుది జట్టులో స్థానం దక్కడం కష్టమేనని యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అంటున్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా.. ఛాన్స్‌లు మాత్రం రాలేదు. ఇప్పుడు దానిని గుర్తుచేసుకుంటూ సర్ఫరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఓ జాతీయ మీడియాతో సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ… ‘నేను ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నా. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకకే నిత్యం ప్రయత్నిస్తా. ఇప్పటివరకు నేను చేసింది కూడా అదే. భవిష్యత్తులోనూ దీన్నే కొనసాగిస్తా. తప్పకుండా నా కెరీర్‌లోనూ మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. అందుకు కాస్త వేచి ఉండాలి. ఇలా జరగడం కూడా నాకు కలిసొచ్చే అంశమే. ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడితే మరింత అత్యుత్తమ బ్యాటర్‌గా మారేందుకు అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.
Also Read: Virat Kohli: అదే నాకు అసలైన గేమ్: కోహ్లీ
‘టెస్టుల్లోకి అరంగేట్రం చేసినప్పుడు తొలి మూడు బంతులను ఎదుర్కొనే సమయంలో కంగారుపడ్డా. కాసేపటికి పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చా. దేశవాళీ క్రికెట్‌లో ఎలా ఆడానో అంతర్జాతీయ మ్యాచులో అలానే ఆడా. ప్రత్యర్థి బౌలర్ వైపు చూడకుండా.. బంతిపై మాత్రమే దృష్టిపెట్టా. ఎలా ఆడాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పాడు. గతేడాది ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడి 200 పరుగులు చేయగా.. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.