Viral News: గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.రకరకాల వంటకాలతో వారిని సంతోషపెడుతారు. ఎప్పటి నుంచి ఈ మర్యాద కొనసాగుతూ వస్తోంది. ఒక వేళ ఏదైనా పెద్ద పండగ వచ్చిందే అనుకోండి ఇక అంతే సంగతులు. ప్రతి ఇంటిలో రకరకాలుగా పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా ప్రత్యక్షమవుతాయి.వారు చేసే మర్యాదలకు ఆ ప్రత్యేకతే వేరు. బంధువులకే ఇలా చేస్తే ఇక ఆ ఇంటికి వెళ్లి అల్లుడికి చేసే మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. కొత్తగా ఆ ఇంటికి వెళ్లిన అల్లుడికి వారు చేసే పద్దతులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా సంక్రాంతికి వచ్చి కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో వడ్డించారు అతని అత్తమామలు.
Read Also: Prabhala Utsavam: కన్నుల పండువగా కొత్తపేట ప్రభల ఉత్సవం
సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడికి 150 రకాలతో భోజనం పెట్టి ఆ ఊరిలోని అత్తమామలు ప్రత్యేకతను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ – సునీత దంపతుల ఇంటికి వారి కుమార్తె హర్షితను తీసుకుని కొత్త అల్లుడు రీషింద్ర మొదటిసారి పెద్ద పండుగకు వచ్చాడు. ఈ సందర్భంగా వెండి కంచంలో 150 వరకు వివిధ రకాల వంటలు రుచి చూపించారు. చక్రపొంగలి, చిక్కిరాలు వంటి సాంప్రదాయ వంటల దగ్గర నుంచి అనేక రకాల స్వీట్లు, పండ్లు భోజనంలో వడ్డించారు. కొన్ని వెరైటీలను అత్తమామలు స్వయంగా అల్లుడికి తినిపించారు. గోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్లు ఇలా మరిచిపోలేని విధంగా మర్యాదలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ విందు గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు.