Prabhala Utsavam: మకర సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు బాణా సంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది.
Read Also: Supreme Court: రేపు చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు
ప్రభలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువుదీర్చారు. వేలాది సంఖ్యలో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చారు.ఎక్కడికక్కడ రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిషిపోయాయి.విశేష సంఖ్యలో భక్తులు దేవత మూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మూడు వీధుల వారు నిర్వహించిన పోటా పోటీ బాణా సంచా కాల్పులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కొత్తపేట డి.ఎస్.పి కె.వి రమణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొత్తపేట ప్రభల ఉత్సవాలు మాత్రం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. సుమారు 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభల ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పెద్దలు చెబుతుంటారు. పాత రామాలయం, కొత్త రామాలయం వీధుల పేరుతో ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పై రెండు వీధులతో పాటు బాణసంచా కాలుస్తున్నారు. కొత్తపేట ప్రభల సంబరాలకు ఉత్సవ కమిటీలు భారీ ఏర్పాట్లు చేశాయి.