Samantha denied rumours of taking 25 crore for myositis treatment from Telugu Actor: గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చికిత్స తీసుకుని కోలుకున్న సామ్.. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి యాక్టింగ్‌కు విరామం ఇచ్చారు. అయితే మయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో నుంచి రూ. 25 కోట్ల ఆర్ధిక సాయంను సమంత పొందారని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమంత స్పష్టం చేశారు. ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందాల్సిన అవసరం తనకు లేదన్నారు. ‘మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా?. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మీరు చెప్పిన దాంట్లో అతి చిన్న మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకూ పని చేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదనుకుంటున్నా. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి బాధ్యత వహించండి’ అని ఇన్‌స్టా స్టోరీలో సామ్ రాసుకొచ్చారు.
ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అయింది. ఇటీవలే ఖుషి మూవీ షూటింగ్ పూర్తిచేసిన సామ్.. ‘సిటడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణను కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సమంత కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా సామ్ కొంతకాలం పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. చికిత్స కోసం ఇటీవల ఇండోనేషియాలోని బాలికి సామ్ వెళ్లారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపుకు తన స్నేహితురాలితో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.