Tollywood Veteran Actor Krishna Statue unveiled in Burripalem: బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ నేడు ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు.. సూపర్ స్టార్ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ ర్యాలీ నిర్వహించనున్నారు. కృష్ణ గత ఏడాది నవంబర్ 15న కన్నుమూసిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, హీరో సుదీర్ బాబు దంపతులు, కృష్ణ కూతుళ్లు మంజుల మరియు పద్మావతి, దర్శకుడు కృషారెడ్డి, మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంకు టాలీవుడ్ సూపర్ స్టార్, కృష్ణ కుమారుఫు మహేష్ బాబు హాజరుకానట్టు తెలుస్తోంది.
కృష్ణకి బుర్రిపాలెంపై ప్రత్యేక మమకారం ఉండేది. హైదరాబాద్‌లో స్థిరపడిన కూడా సొంత ఊరుకి తరచూ వెళుతుండేవారు. ఇప్పటికీ గ్రామంలో మూడు అంతస్తుల భవనం ఉంది. కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళినపుడు అందులోనే ఉంటారు. బుర్రిపాలెంలో కృష్ణ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ పేరు మీదే ఓ పాఠశాల ఉంది. గీతా మందిరం, బస్టాఫ్, ఆలయం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారు. స్వగ్రామంలో సూపర్ స్టార్ గుర్తుగా ఆయన అభిమాన సంఘం విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేసింది. కృష్ణ విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్య శిల్ప శాలలో ప్రత్యేకంగా తయారు చేయించారు.