ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఎక్కడనుంచి పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగింది. ఎట్టకేలకు ఆయన కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానం సమాజ్‌వాదీకి కంచుకోట లాంటింది. ఇక్కడ అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ 1999లో, 2000, 2004లో ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2009, 2012, 2014లో అఖిలేష్ భార్య డింపుల్ గెలిపొందారు. 2019లో మాత్రం బీజేపీకి చెందిన సుబ్రత్ పాఠక్ విజయం సాధించారు. ఈ స్థానం ఎస్పీకి తిరుగులేని స్థానంగా ఉండడంతో అఖిలేష్ దీన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని ఆ పార్టీ తెలిపింది.
2019లో బీజేపీకి చెందిన సుబ్రత్ పాఠక్ 14 వేల ఓట్లతో గెలుపొందారు. అంతకముందు కన్నౌజ్ సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 2012లో జరిగిన ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ భార్య ఈ సీటును గెలుచుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆమె దానిని నిలబెట్టుకున్నారు. ఇక 2024లో డింపుల్ మెయిన్‌పురి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 7న పోలింగ్ జరగనుంది.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీ, కాంగ్రెస్ స్థానాలు పంచుకున్నాయి. ఇప్పటికే తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy: కేసీఆర్ కు నాలెడ్జ్ లేదు