Saleshwaram Jatara: తెలంగాణ అమరనాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు నల్లమల అభయారణ్యంలోని సళేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్యా అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. లోయ గుహలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. అయితే.. గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా పోలీసు, హెల్త్, ఇతరత్రా శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మూడు రోజులు పాటు మాత్రమే జాతరకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి, పుణ్యక్షేత్రముగా ప్రసిద్ది గాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారే అనుమతి ఇస్తున్నారు. అయితే.. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దీంతో గుండంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇక నుంచి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మే నెల నుంచి 9 నెలల పాటు రోజుకు 100 మందికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అనుమతిని ఇస్తామని డీఎఫ్‌వో వెల్లడించారు. ఈ ప్యాకేజీలో స్థానిక చెంచులకు ఉపాధి కల్పించడం ద్వారా వారే ప్రత్యేక వాహనాల్లో సలేశ్వరం వరకు తీసుకెళ్లి దగ్గర ఉండి దర్శనం చేయిస్తారని పేర్కొన్నారు.