Sajjala Ramakrishna Reddy : గన్నవరం రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏదో జరగబోతోంది అనే చర్చ సాగుతోంది.. అయితే యార్లగడ్డ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం.. ఒకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చోట మరొకరికి సర్దుబాటు చేస్తాం అన్నారు. కానీ, ఇక కాదనుకుంటే వారి ఇష్టం.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: RS Praveen Kumar: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది..?
అయితే, గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతాను అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరంలో అనుచరులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గన్నవరం సీటు మళ్లీ ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరుతానని.. రెండేళ్లుగా సీఎం అపాయింట్‌మెంట్ అడుగుతున్నా దొరకలేదన్నారు. తాము లేఖ రాసినా, స్పందన లేదని.. ఎలాంటి పరిణామాలు జరిగినా గన్నవరం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నానిని తేల్చిచెప్పారు. దీంతో, గన్నవరంలో ఏం జరగుతుందనే చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్.. ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ సారి వైసీపీ టికెట్.. వల్లభనేనికే ఫైనల్ అయ్యే అవకాశం ఉందట. దీంతో.. యార్లగడ్డ టీడీపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే సైకిల్ ఎక్కుతారనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.