ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సేవ్ సాయిల్ పేరిట ప్రపంచంలోని 27 దేశాల్లో పర్యటించిన సద్గురు ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి సాంద్రత మెరుగు పరిచినప్పుడే గ్రామీణ భారత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మట్టిని రక్షించుకోవడం అందరి బాధ్యత అని సద్గురు గుర్తుచేశారు. మట్టి పునరుత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 2.5 బిలియన్ల ప్రజలు సేవ్ సాయిల్ గురించి మాట్లాడారని.. కనీసం 3.6 బిలియన్ల ప్రజలతో సేవ్ సాయిల్ గురించి మాట్లాడించటం తమ లక్ష్యమని సద్గురు ప్రకటించారు.
Uttar Pradesh: వలస కూలీల సైకిళ్ల వేలం.. ప్రభుత్వానికి రూ.21 లక్షల ఆదాయం
ఉక్రెయిన్ యుద్ధంతో ఆహార భద్రత గురించి ప్రపంచం ఆలోచించటం మొదలుపెట్టిందని సద్గురు వెల్లడించారు. చాలా దేశాల్లో ఆహార భద్రత కోసం బంజరు భూములను వ్యవసాయ భూములుగా మారుస్తుంటే.. మన దేశంలో వ్యవసాయ భూములను బంజరు భూములుగా మారుస్తున్నారని సద్గురు ఆరోపించారు. పంటల్లో ఆర్గానిక్ కంటెంట్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్బన్ క్రెడిట్ సిస్టంను రైతులకు అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం పేరుతో, ఎరువుల వినియోగం ఒక్కసారిగా తగ్గిస్తే, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. జర్మనీ, భారత్ , ఫ్రాన్స్ దేశాల్లో మినహా మరెక్కడా సాయిల్ హెల్త్ కార్డ్ విధానం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్గానిక్ పదం మార్కెటింగ్ వస్తువుగా మారిందని అభిప్రాయపడ్డారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో ప్రజల్లో మార్పు రానంత వరకు, ఎన్ని చట్టాలు తెచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. చిన్న, మధ్య తరగతి రైతులకు సేంద్రీయ వ్యవసాయం విషయంలో ప్రోత్సాహకాలు అవసరమని చెప్పారు. రైతులకు ప్రధాని మోదీ సహకారం బాగుందని సద్గురు ప్రశంసలు కురిపించారు.