Sabarimala Gold Theft Case: శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దోపిడీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో భాగంగా ప్రముఖ మలయాళ, తమిళ నటుడు జయరామ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించింది. ‘కాంతార’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన జయరామ్ పేరు ఈ వ్యవహారంలో రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని జయరామ్ నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజల గురించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ జరిగింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయాల గురించే అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయం ఈ విచారణలో కీలకంగా మారింది. ఉన్నికృష్ణన్ పొట్టి జయరామ్‌తో కలిసి ఎప్పుడు పూజలు చేశారు? ఆ సందర్భాల్లో జరిగిన లావాదేవీలు? లాంటి తదితర అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఆ కార్యక్రమాన్ని ఉన్నికృష్ణన్ పొట్టే నిర్వహించాడని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకొచ్చిన వస్తువులను బంగారం పూత పనులకు ఉపయోగించారని అధికారులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో సిట్ ప్రస్తుతం రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి, ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం తీసేశారా? రెండోది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమయ్యిందా? అన్న రెండు అంశాలపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు బి. మురళీబాబు, ఎస్. శ్రీకుమార్ ఉన్నారు. అయితే 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి చట్టపరమైన బెయిల్ లభించింది.