Rythu Bandhu Distribution Starts From Today in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచి పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయశాఖపై సోమవారం సీఎం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సోమవారం జరిగిన సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు-ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగానే రైతుబంధు పంపిణీపై సీఎం ఆదేశాలిచ్చారు. 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది.
Also Read: Gold Rate Today: పడిపోయిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంతుందంటే?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రూ.2 లక్షల రుణమాఫీ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్నీ విధాలుగా ఆదుకుంటామని ఈ సమీక్షలో సీఎం తెలియజేశారు. ఇక ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని.. ప్రజల కోసం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు.