NZ vs SA: పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు ప్రతిఘటన కూడా చేయకుండానే 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్‌లో 350 పరుగుల మార్కును అధిగమించడం నాలుగోసారి. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(60) మాత్రమే కాస్త రాణించగలిగాడు. విల్ యంగ్ 33 పరుగులు, డారిల్ మిచెల్ 24 పరుగులు చేయగా.. మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ మహరాజ్ 4 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. మార్కో జాన్సన్ మూడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు, కగిసో రబాడ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Also Read: NZ vs SA: సెంచరీలతో రెచ్చిపోయిన డికాక్, డుసెన్.. దక్షిణాఫ్రికా భారీ స్కోరు
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. సఫారీలలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (114), వాన్‌డర్ డుసెన్ (113)లు అద్భుత శతకాలు బాదారు. ఓపెనర్ తెంబా బవుమా 24 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో 53 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అజేయమైన భారత్‌తో వారు పాయింట్లతో సమానంగా ఉండగా, దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ అధికంగా ఉండడంతో మొదటి స్థానానికి వెళ్లింది.