Medvedev: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ సంస్థ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సోమవారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)పై క్షిపణి దాడి చేస్తామని బెదిరించారు. రష్యా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు క్షిపణి దాడితో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టునే బెదిరించడం గమనార్హం. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధ నేరాలకు పుతిన్ కారణమని ఐసీసీ ఆరోపించింది, అయితే ఉక్రెయిన్‌లో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదని రష్యా ఖండించింది.
Read Also: Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
పుతిన్ విధేయుడైన మెద్వెదేవ్ టెలిగ్రామ్‌లో ఇలా వ్రాశాడు, “ప్రతి ఒక్కరు భగవంతుడు, క్షిపణులకు జవాబుదారీగా ఉంటారు. ఉత్తర సముద్రంలోని రష్యా నౌక నుంచి హేగ్‌లోని భవనంపైకి హైపర్ సోనిక్ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమే.” అని ఆయన రాసుకొచ్చారు. ఆకాశాన్ని సునిశితంగా గమనిస్తూ ఉండండి అంటూ జడ్జీలను బెదిరించారు. అలాగే ఐసీసీ ఒక దయనీయ అంతర్జాతీయ సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పేర్కొంటూ ఈ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్ ఇప్పటికే తెలిపింది. పుతిన్ అరెస్ట్‌కు సంబంధించిన వారెంట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సమర్థించారు.