RS Praveen Kumar : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “పారదర్శకంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు వారి కుటుంబ సభ్యులే సూచించాలి. అక్రమ ఆదేశాలు పాటిస్తున్న అధికారులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు.
సచివాలయంలో రేవంత్ రెడ్డి సైబర్ పెట్రోలింగ్ చేయాలని సవాల్ విసిరారు. “ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే సచివాలయంలో ఫైల్స్ కదులుతున్నాయి” అని ఆరోపించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఒకేరోజు 10 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. “సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి రాజకీయ అవసరాలకు వాడుతున్నారు” అని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ సైన్యం పేరుతో కేటీఆర్‌ను ట్రోల్ చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలను ట్రోల్ చేస్తున్నారు, అయితే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, కానీ బీజేపీపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు” అని విమర్శించారు.
“హరీష్ రావును పెట్రోల్‌తో కాల్చుతానని మైనంపల్లి హనుమంతరావు అన్నా, కానీ ఆయనపై కనీసం కేసు పెట్టలేదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కాల్చుతానంటే అది ఎలా సివిల్ కేసుగా మారుతుంది?” అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.