Rohith Reddy Denies Party Switching Rumours: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఖండించారు. గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదం అని పేర్కొన్నారు. సొంత పనుల మీద అమెరికా వచ్చానని, త్వరలోనే తాండూరు వస్తా అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటా అని గువ్వల బాలరాజు తెలిపారు. ఈ మేరకు అమెరికా నుంచి రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు.
‘పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. గువ్వల బాలరాజును నేనే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంకా కొంత మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరినీ నమ్మవద్దు. బీజేపీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామని, ఉన్నత పదవుల ఆశ చూపింది. తెలంగాణకు అన్యాయం చేయవద్దని బీఆర్ఎస్ కంకణబద్దుడిగా, కేసీఆర్ మాసనపుత్రుడిగా నేను సాహసం చేశాను. సొంతలాభం ముఖ్యం కాదని, తాండూరు అభివృద్ధి ముఖ్యమని భావించాను. కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్లను బహిరంగంగా ఆ రోజు ప్రపంచానికి పట్టించాను. ధైర్యసాహసాలు చేసిన ఈ తాండూరు బిడ్డ.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు’ అని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: RR vs CSK: అబ్బో.. ఆ ఆటగాళ్లను మాత్రం ఇవ్వం! రాజస్థాన్‌కు చెన్నై షాక్
‘తెలంగాణను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీతోనే వెళ్తా. ఇతర పార్టీలకు తొత్తులుగా మారిన మీడియాను హెచ్చరిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించుకున్నాం. సొంత పనుల మీద అమెరికా వచ్చాను.. త్వరలోనే వస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటా. పార్టీ మార్పుపై ఎటువంటి ఆలోచన లేదు. త్వరలోనే తాండూరుకు వస్తా’ అని రోహిత్ రెడ్డి తెలిపారు.