CSK Rejects Rajasthan Royals’ Proposal: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను కెప్టెన్ సంజు శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. తనను విడుదల చేయాలంటూ ఇప్పటికే ప్రాంఛైజీని కోరాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సంజును తీసుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంజు ట్రేడ్ కోసం ఆర్ఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంజు బదిలీ కోసం పలు ఫ్రాంచైజీలను ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె నేరుగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన వికెట్ కీపర్, బ్యాటర్ కోసం బదాలె చూస్తున్నాడట. ఈ క్రమంలోనే సీఎస్‌కేను సంప్రదించాడట. అయితే ఆర్ఆర్ ప్రతిపాదనను సీఎస్‌కే తిరస్కరించినట్లు తెలుస్తోంది.
సంజు శాంసన్ స్థానంలో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లేదా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బదిలీ కోసం సీఎస్‌కేకు ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె ప్రతిపాదించాడు. మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబెను కూడా తీసుకునేందుకు బదాలె ఆసక్తి చూపారట. అయితే రాజస్థాన్ ప్రతిపాదనను చెన్నై సున్నితంగా తిరస్కరించింది. స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని బదాలెకు సీఎస్‌కే యజమాని స్పష్టం చేసినట్లు సమాచారం. సీఎస్‌కే, ఆర్ఆర్ మధ్య ట్రేడింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లే.
Also Read: Strange Death: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి!
మనోజ్ బదాలె మరికొన్ని ఫ్రాంచైజీలతో కూడా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రేడింగ్ సాధ్యం కాకపోతే సంజు శాంసన్ రాజస్థాన్ జట్టుతోనే కొనసాగాల్సి ఉంటుంది. ఓ ప్లేయర్‌ను రిలీజ్ చేయాలన్నా లేదా ట్రేడింగ్ చేయాలన్నా పూర్తిగా ఫ్రాంచైజీదే తుది నిర్ణయం. ప్లేయర్ విజ్ఞప్తి మాత్రమే చేయగలడు. ప్రస్తుతం సంజు భవిష్యత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. సంజు ఏదైనా జట్టుకు మారతాడో చూడాలి.