Rohit Sharma To Play for India A against Australia A: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం హిట్‌మ్యాన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉండగా.. సిరీస్ రద్దయింది. ఇక ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు. అయితే అంతకుముందే హిట్‌మ్యాన్ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముందు భారత్-ఎ తరఫున రోహిత్ బరిలోకి దిగే అవకాశముంది.
అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభం కానుంది. ముందుగా వన్డే సిరీస్, ఆపై టీ20 సిరీస్ జరగనున్నాయి. ఆసీస్ పర్యటనకు ముందు భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్లు కాన్పూర్‌లో వన్డేలు ఆడనున్నాయి. సెప్టెంబరు 30, అక్టోబరు 3, అక్టోబరు 5న వన్డేలు జరగనున్నాయి. భారత్-ఎ తరఫున రోహిత్ శర్మ ఆడనున్నాడని తెలుస్తోంది. ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడవచ్చని రెవ్‌స్పోర్ట్జ్ తన నివేదికలో పేర్కొంది. దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హిట్‌మ్యాన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ దాదాపు ఖాయమే. భారత్-ఎ తరఫున ఆడితే మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుంది.
రోహిత్ శర్మ చివరగా భారత్ తరఫున మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. తర్వాత భారత్ తరఫున ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తర్వాత రోహిత్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. అయితే టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడుతాడని తెలుస్తోంది. ప్రపంచకప్ ఆడాలంటే ఇంకా రెండేళ్లు ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది.