సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు తాము వస్తామో లేదో అని రోహిత్ చెప్పాడు.
‘ఆస్ట్రేలియాకు రావడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ ఆడటం అద్భుతంగా ఉంటుంది. 2008లో ఇదే సిడ్నీ మైదానంలో హాఫ్ సెంచరీ చేశా. అప్పుడు మ్యాచ్‌ను కూడా గెలిపించా. దానిని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాను. సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఈరోజు కూడా ఎంజాయ్ చేశా. మొదటి వికెట్ పడ్డాక విరాట్ వచ్చాడు. వికెట్ ఇవ్వకుండా రన్స్ చేయాలనుకున్నాం. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read: INDW vs AUSW: అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతోనే భారత్ సెమీస్!
‘నేను, విరాట్ కోహ్లీ మరలా ఆస్ట్రేలియాకు వస్తామో లేదో నాకు తెలియదు. ఇన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఆడటం సరదాగా ఉంది. ఆస్ట్రేలియాలో నాకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అలానే చెడు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆసీస్ గడ్డపై క్రికెట్ ఆడటాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించా. మమ్మల్ని ఆదరించిన ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మరలా తామిద్దరం ఆస్ట్రేలియాకు రామని రోహిత్ హింట్ ఇచ్చాడని నెటిజెన్స్ అంటున్నారు. 2027 ప్రపంచకప్‌లో రో-కోలు ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.