Riyan Parag in T20 World Cup 2024 India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం ఆసన్నమవుతోంది. ఐపీఎల్ 2024 అనంతరం మెగా టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. దాంతో త్వరలోనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే సమావేశం అయ్యారు. దాంతో ప్రపంచకప్ టోర్నీ కోసం భారత జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీసీఐ మే 1న భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి ప్రదర్శనతో పాటు ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ సమావేశం అనంతరం కొన్ని కీ పాయింట్స్ బయటికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీ ఆడనున్నారట. ఇప్పటివరకు టీ20ల్లో ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉండే అవకాశం ఉంది. గిల్ పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీలో విరాట్ ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కొన్ని నెలల ముందు వరకు హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆటగాడిగా అయినా అతడు జట్టులో ఉంటాడని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గాయంతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న హార్దిక్.. ఐపీఎల్ 2024లో పునరాగమనం చేశాడు. కానీ అతడి ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. బ్యాటింగ్, బౌలింగ్, సారథ్యం.. అన్నింటిలో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2024లో 4 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులు ఇచ్చాడు. బ్యాటర్‌గా 131 పరుగులే చేశాడు. దాంతో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో బౌలర్‌గా సత్తా చాటితేనే హార్దిక్ పేరును టీ20 ప్రపంచకప్‌కు పరిగణించే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: Ram Mandir : అయోధ్యలో అద్భుత దృశ్యం చూసేందుకు ఆలయ ట్రస్ట్ చేసిన ఏర్పాట్లు ఇవే
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇచ్చే విషయంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇందుకు కారణం ఐపీఎల్ 2024లో అతడు అదరగొట్టడమే. గత సీజన్లలో ఓవర్ యాక్షన్ చేస్తూ మీమ్స్ బారిన పడిన రియాన్.. ఈసారి తన బ్యాట్‌కు పనిచెబుతునాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 161 కాగా.. యావరేజ్ 63. పరాగ్‌కు అవకాశం వస్తుందో లేదో చూడాలి.