Rohit Sharma and Suryakumar Yadav might part ways with Mumbai Indians ahead of IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందు మెగా వేలం జరగనుంది. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించనుంది. వచ్చే డిసెంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. రూల్స్ ప్రకారం.. ఒక్కో జట్టు 3-5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో అన్ని జట్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ టాప్ టీమ్ ముంబై ఇండియన్స్‌లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లు జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ముంబై కెప్టెన్సీ మార్పు విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈ స్టార్లు.. వేర్వేరు జట్లలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసంతృప్తిలో ఉన్న రోహిత్, సూర్యలు ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌కు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలోకి వీరు వెళ్తారని తెలుస్తోంది. రోహిత్‌ను కొనేందుకు ఆస్తులు కూడా అమ్మేస్తానని కింగ్స్ పంజాబ్ సహయజమాని ప్రీతి జింతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ కోసం చెన్నై కూడా చూస్తోంది.
Also Read: Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు విజేతగా నిలిచింది. పదేళ్ల పాటు జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. పదేళ్లలో ఐదు టైటిల్స్ అందించడం అంటే మాములు విషయం కాదు. అయితే రోహిత్ కెరీర్ చివరి దశలో ఉండటంతో జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించిన ముంబై యాజమాన్యం.. ఐపీఎల్ 2024 ముందు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం ప్లేయర్స్ సహా అభిమానులకు కూడా మింగుడుపడలేదు. ముంబై జట్టులో విబేధాలు తలెత్తాయి. దాంతో ఐపీఎల్ 2024లో ముంబై దారుణ ప్రదర్శన చేసింది.