Tejashwi Yadav after meeting Jharkhand CM Soren: 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ఆయన నివాసంలో భేటీ అనంతరం తేజస్వీ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిసినట్లు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గురించి చర్చించినట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీడియాతో వెల్లడించారు.
జార్ఖండ్‌లో అధికార కూటమికి చెందిన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సంకీర్ణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తేజస్వీ యాదవ్ చెప్పారు. జార్ఖండ్‌లో పార్టీ పనిని తాను ముందుగానే పర్యవేక్షించాలని అనుకున్నానని అయితే ఆర్జేడీ చీఫ్ , తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా జార్ఖండ్‌లో పర్యటించలేకపోయానని వెల్లడించారు. సింగపూర్‌లో తన తండ్రికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. తన మాతృభూమికి తిరిగి వస్తారని, ఆయన ప్రాణం ఈ భూమితో ముడిపడి ఉందన్నారు. ఇదే సమయంలో మేము బీహార్ లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బీజేపీని అధికారం నుండి తొలగించడంలో సక్సెస్ అయ్యామన్నారు.
bachelors padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
ఇక జార్ఖండ్ లో బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తామని కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీహార్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు దిగుతోందని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆర్జేడీ నేత శ్యామ్ రజక్, జేఎంఎం అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ను కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని తేజస్వీ యాదవ్ ఆకాంక్షించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఫిబ్రవరి 9న రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.