Rishi Sunak: బ్రిటన్‌లో రిషి సునాక్ సర్కారును వలసలు కలవరపెడుతున్నాయి. ఆ వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్‌లో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో.. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని సునాక్ యోచిస్తున్నారు. గతేడాది 1.73 లక్షల మంది బ్రిటన్‌కు వలస వెళ్లగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 5.04 లక్షలకు పెరిగినట్టు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది. అంటే ఒక్క ఏడాదిలోనే వలసల సంఖ్య ఏకంగా 3.31 లక్షలు పెరిగింది.
విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వలసలు విపరీతంగా పెరిగిపోతుండడంపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వం వాటిని ఆపాలని నిర్ణయించింది. గతంలో చైనా నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున బ్రిటన్‌కు వెళ్లేవారు. ఈసారి మాత్రం చైనా విద్యార్థుల సంఖ్యను భారత విద్యార్థులు అధిగమించారు. అయితే, అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉండగా.. దీంతో సునాక్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే.. భారతీయులపైనే అధిక ప్రభావం ఉండే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ యూనివర్సిటీలు సొంత దేశ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేస్తాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు విదేశీ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయి. ఇప్పుడు విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధిస్తే వర్సిటీలు దివాలా తీసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల రాకపై ప్రభుత్వం కనుక ఆంక్షలు విధిస్తే ఆ ప్రభావం భారత్‌పైనే ఎక్కువగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Mahi Gupta team leader: మెట్రో స్టేషన్‌కు టీమ్ లీడర్‌గా హిజ్రా.. సహించని వారే సలాం కొట్టేలా..
వలస వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్ పూర్తిగా కట్టుబడి ఉన్నారని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి మీడియాతో వెల్లడించారు. ఇందులో భాగంగానే యూకేకు వచ్చే విదేశీ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వలసల విషయంలో యూకే ప్రభుత్వం విమర్శలు, వివాదాలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. గతంలో యూకే హోంమంత్రి సుయోల్లా బ్రేవర్మన్.. భారతీయ విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.