‘కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో’ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. ఇద్దరు నాణెంకు ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు సీబీఐకి ఇవ్వు అని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు అని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీటింగ్లో పాల్గొన్నారు. జనం భారీగా తరలి వచ్చారు.
Also Read: Peddi vs Ustaad Bhagat Singh: ‘బాబాయ్-అబ్బాయ్’ బ్యాక్ టు బ్యాక్.. మెగా అభిమానులకు పండగే!
‘నక్క జిత్తులతో కొన్ని నక్కలు మీ దగ్గరికి వస్తున్నాయి. పదేళ్లు రాని వాళ్లు ఇప్పుడు వస్తున్నారు. సినిమా కార్మికుల సమస్యలపై కేటీఆర్ ఏనాడూ ఆలోచించలేదు. కేటీఆర్ సినిమా హీరోల గెస్ట్‌హౌస్‌లు తిరిగాడు కానీ సినీ కార్మికులను కలిసిన పాపాన పోలేదు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదు.. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. కాళేశ్వరం మీద సీబీఐకి ఇవ్వు.. లోపల వేస్తాం అన్నాడు కిషన్ రెడ్డి. అర్థరాత్రి వరకూ అసెంబ్లీ నడిపించి.. సీబీఐ విచారణకి ఇచ్చాం. కానీ ఇప్పటికీ విచారణ లేదు. కిషన్ రెడ్డి నా ఇంటికి వస్తా అంటున్నాడు. నా ఇంటికి ఎందుకు, మోడీ ఇంటికి పో. మీ దగ్గరే కదా సీబీఐ ఉంది. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు. కేసీఆర్ లాంటి వారినే ఫామ్ హౌస్‌కి పరిమితం అయ్యేలా చేశారు మా కార్యకర్తలు. కిషన్ రెడ్డి నేను కింగ్ ఐత అంటున్నాడు. కింగ్ అవ్వుడు సంగతి పక్కన పెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో కిషన్ రెడ్డి’ అని సీఎం విమర్శించారు.