Site icon NTV Telugu

Revanth Reddy : తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!

Revanth Reddy On Brs

Revanth Reddy On Brs

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచేందుకు అవసరమయ్యే కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్! మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు @blsanthosh హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read : Sabitha Indra Reddy : ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు డబుల్‌ బెడ్‌ రూంలు

ఇదిలా ఉంటే.. నిన్న రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం1 స్థానాల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని బీఆర్ఎస్ ఎంపీలే నాకు చెప్పారని అన్నారు. ఈ పొత్తుల బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని అనేక సర్వేలు చెబుతున్నాయని అందువల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోడీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోడీని ఆయన దర్బారులో సన్మానం చేశారని శాలువాలు, పూలదండలు మాత్రమే కాదు బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయని అందుకే కేసీఆర్‌పై మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారని మండిపడ్డారు.

Also Read : ICC World Cup: ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ కు ప్రేక్షకులు డుమ్మా.. వెలవెలపోయిన నరేంద్ర మోడీ స్టేడియం..

Exit mobile version