తెలంగాణ పోలీసులను ఓ రిమాండ్ ఖైదీ బురడీ కొట్టించాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే.. పోలీసుల కండ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులను డీటెయిల్స్ అడిగి పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల సబ్ జైలులో పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గల్ఫ్ పంపిస్తానని మోసం చేసిన కేసుల్లో అరెస్ట్ అయి జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవలే అతడిపై కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. జగిత్యాల సబ్ జైలులో ఉన్న ప్రసాద్‌ను విచారణలో భాగంగా మంగళవారం కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్‌తో తీసుకెళ్లి జగిత్యాల కోర్టులో హాజరుపర్చారు. కేసు డీటెయిల్స్ పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడు ప్రసాద్‌కు రిమాండ్ విధించారు.
Also Read: NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి!
కోర్టు లోపలి నుంచి బయటకు వచ్చిన రిమాండ్ ఖైదీ ప్రసాద్ తన కుటుంబసభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో కానిస్టేబుల్ సాగర్ రిమాండ్ వారెంట్ తీసుకోవడానికి కోర్టు లోపలికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రసాద్.. కానిస్టేబుల్ సాగర్ కండ్లుగప్పి కోర్టు నుంచి పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం చర్చనీయాంశం అయింది.