Relief for YSRCP Leaders in AP High Court: ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా… హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల విచారణపై న్యాయస్థానం కూడా స్టే ఇచ్చింది. అలాగే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. నోటీసు ఇచ్చి విచారిస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
READ MORE: Mahesh Kumar Goud: జులై 31 నుంచి ఆగస్టు 6 వరకు పాదయాత్ర, శ్రమదానం!
ఇదిలా ఉండగా.. వైసీపీ కార్యకర్త కరీంసా అక్రమ నిర్బంధంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వచ్చింది. ఈ నేపథ్యంలో పిడుగురాళ్ల టౌన్ సిఐ వెంకట్రావు విచారణకు హాజరయ్యారు. సీఐ వెంకట్రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు రాజీ చేసుకోమని పిడుగురాళ్ల సీఐ వెంకటరావు ఎలా వేధించారో ధర్మాసనానికి కరీంసా వివరించారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. కేసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తీసుకొస్తారో… ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేం ఐఫిల్ టవర్ పై కూర్చోలేదు. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నాం. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు.” అని కోర్టు తెలిపింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చు అని కరీంసాకు న్యాయస్థానం వెల్లడించింది.