Rayachoti Student Died In Ukraine: ఎన్నో ఆశలతో కొడుకును ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు ఆ తల్లిదండ్రులు. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి కొడుకును డాక్టర్ చేయాలని ఆశపడ్డారు. వాళ్ల ఆశలన్నీ అతనిపైనే పెట్టుకొని బతుకుతున్నారు. కొన్ని రోజుల్లో కొడుకు డాక్టర్ అయి తీరివస్తాడు కష్టాలు తీరతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి తమ కొడుకు ఇక లేడు అనే చేదు వార్త తెలిసింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారి బాధ చూసి చుట్టుపక్కల వారు కూడా ఈ కష్టం ఎవరికీ రాకూడదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన కొడుకు తోడు లేకుండా పోయాడు, ఇక ఎప్పటికీ రాడు అనే విషయం జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమే అని విచారణం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిన రాయచోటి విద్యార్థి గుండెపోటుతో మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఐదుగురు మృతి..
వివరాళ్లోకి వెళ్తే.. రాయచోటి పూజారి బండ వీధికి చెందిన దంపతులు రావూరి శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి తమ కొడుకు రావూరి గిరీష్ ను ఎంబీబీఎస్ చదివించాలనుకున్నారు. కొడుకు భవిష్యత్తే ముఖ్యమనుకున్న వారు ఆస్తులు అమ్మి, అప్పులు చేసి కొడుకును చదువు కోసం ఉక్రెయిన్ పంపించారు. గత నాలుగేళ్లుగా గిరీష్ ఉక్రెయిన్ లోనే ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 20వ తేదీన గిరీష్ స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో అతను గుండె పోటులో మరణించాడు. ఈ వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడని ఊహించుకోవడం కూడా వారికి కష్టంగా ఉంది. గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల రోదనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనీసం తమ కొడుకును కడసారి చూసేందుకైనా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.