Ravichandran Ashwin Reveals Scam Attempt Using Devon Conway’s Name: చెన్నై సూపర్ కింగ్స్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టు ప్రణాళికల్లో తాను లేకుంటే.. టీమ్ నుంచి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఫ్రాంచైజీకి అశ్విన్ తెలియజేసినట్లు సమాచారం. గత వేలంలో రూ.9.75 కోట్లకు అశ్విన్‌ను కొనగా.. 9 మ్యాచ్‌లాడి 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే అతడిని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా.. యాష్ తాజాగా ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. సీఎస్కే సహచరుడు, న్యూజీలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే పేరుతో తనను ఓ వ్యక్తి మోసం చేయాలని చూశాడని చెప్పాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత ఓ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. తాను డెవాన్ కాన్వే అని చెప్పాడు. నేను రిప్లై ఇచ్చాను. విరాట్ కోహ్లీ నంబర్ మిస్సయ్యాను, నాకు పంపిస్తావా? అని అడిగాడు. నేను నంబర్ సెండ్ చేశాను. కాసేపటికి నేను ఇంకొందరి నంబర్లు కూడా మిస్సయ్యాను అని మెసేజ్ చేశాడు. ఎవరివి అని నేను రిప్లై ఇచ్చాను. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ అని మెసేజ్ పంపాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ఇచ్చిన బ్యాట్ ఎలా ఉంది? అని అడిగా. బ్యాట్ అద్భుతంగా ఉందిని రిప్లై ఇచ్చాడు. అతడు డెవాన్ కాన్వే కాదని అర్ధమయింది. ఎందుకంటే.. నేను ఎవరికీ బ్యాట్ ఇవ్వలేదు’ అని చెప్పాడు.
‘వెంటనే ఆ వ్యక్తి నంబర్‌ను బ్లాక్ చేశాను. చెన్నై సూపర్ కింగ్స్ వాట్సప్ గ్రూప్‌లోకి వెళ్లి చెక్ చేశాను. అది డెవాన్ కాన్వే నంబర్ కాదు. అయితే నేను విరాట్ కోహ్లీ ప్రస్తుతం వాడే నంబర్ ఇవ్వలేదు. విరాట్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అతడు ఉపయోగించిన వాట్సప్ నంబర్ ఇచ్చాను. దేవుడికి ధన్యవాదాలు. ఎందుకంటే అందరి నంబర్లు ఇవ్వలేదు’ అని ఆర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) 2025లో దిండిగల్ డ్రాగన్స్ తరపున ఆడాడు. దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్స్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో టెస్టులకు యాష్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.