Ravi Shastri: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య దేశంతో మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తాజా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భాగం అయ్యారు. ఏడు నెలల విరామం తర్వాత రోహిత్ – కోహ్లీ ద్వయం భారత జట్టు తరపున మైదానంలోకి దిగనున్నారు. కాబట్టి అందరి దృష్టి వారిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు.
READ ALSO: Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?
వన్డే కెరీర్‌లపై ఊహాగానాలు..
ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కావడంతో విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లపై తాజాగా ఊహాగానాలు జోరందుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే టెస్ట్, టీ 20 క్రికెట్ల నుంచి రిటైర్ అయ్యారు. తాజాగా టీమిండియా – ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సందర్భంగా ఈ స్టార్ జోడి ఏడు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈక్రమంలో రోహిత్ – కోహ్లీలు భారత జట్టుకు ఈ ఫార్మెట్‌లో ఎంతకాలం ఆడతారనే దానిపై ప్రస్తుతం చర్చలు తీవ్రమయ్యాయి. తాజాగా ఈ చర్చలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వారు కలిసి ఎప్పుడూ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని చెప్పారు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, కానీ రోహిత్ శర్మ ఆ సమయంలో జట్టులో లేడని గుర్తు చేశారు. రోహిత్, కోహ్లీ గురించి ఇప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదని సూచించారు.
రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా ఈ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. వారి ఫిట్‌నెస్, ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ఈ విషయాన్ని అతిగా సంక్లిష్టంగా మార్చకూడదని చెప్పారు. “విరాట్ కోహ్లీ ఛేజింగ్ మాస్టర్, రోహిత్ శర్మ ఒక బ్లాస్టింగ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. వాళ్లు 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో భాగం అవుతారా లేదా అనేది వాళ్లు.. ఆట పట్ల ఎంత ఆకలితో ఉన్నారు, ఎంత ఫిట్‌గా ఉన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాళ్ల విషయంలో ఒక నిర్ణయానికి రాడానికి ఇంకా చాలా దూరం వెళ్లాలి” అని చెప్పారు. “భారతదేశం T20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు, జడేజా, కోహ్లీ, రోహిత్ స్వయంగా రిటైర్మెంట్ తీసుకున్నారని మీరు చూసి ఉంటారు. ఎవరూ వారిని బలవంతం చేయలేదు. వారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ODIలలో కూడా అదే జరుగుతుందని నేను భావిస్తున్నాను. వారు ఆడటం ఆనందించకపోతే లేదా వారి ఫామ్ పడిపోతే, వారు స్వయంగా వెనక్కి తగ్గుతారు” అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. గత ఏడాది జరిగిన T20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అలాగే ఈ ఏడాది వీళ్లిద్దరూ టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగుతుంది. టీమిండియా జట్టు వన్డే జట్టుకు శుభ్‌మాన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నిలువనున్నారు.
READ ALSO: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో రకుల్, సమంత, తమన్నాలకు ఓటర్ కార్డు?