Rahul Gandhi’s Speeches During Yatra Creating Tremors In India says MK stalin: భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో విడుదల చేసిన ఆయన నెహ్రూపై ప్రశంసలు గుప్పించారు. నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను కీర్తిస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతునప్పుడు.. ఇప్పుడు మనకు నెహ్రూ గుర్తుకు వస్తున్నారని అన్నారు. తమిళనాడుకు పెరియార్, అన్నాదురై, కలైంజర్(కరుణానిధి) లాగే దేశంలో సమాఖ్య, సమానత్వం, లౌకికవాదాన్ని పెంపొందించడానికి గాంధీ, నెహ్రూ వంటి నాయకులు అవసరం అని అన్నారు.
Read Also: Pakistan: బలూచిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని.. ఆయన ఎన్నికల రాజకీయాలు, పార్టీ రాజకీయాలకు దూరంగా భావజాలంపైనే మాట్లాడుతున్నారని.. అందుకే ఆయన్ను కొందరు వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు కొన్ని సార్లు నెహ్రూలా ఉంటాయని కితాబిచ్చారు. నెహ్రూ వారసుడి వ్యాఖ్యలు, గాడ్సే వారసులకు చిరాకు తెప్పిస్తున్నాయని అన్నారు.
నెహ్రూ కేవలం కాంగ్రెస్ వ్యక్తి మాత్రమే కానది.. భారతదేశం గొంతుకలా ప్రతిధ్వనించారని.. భారతదేశానికి మొత్తానికి ప్రధాన మంత్రి అని.. ఆయన ఒక ఒక భాష, ఒక విశ్వాసం, ఒక మతం, ఒక సంస్కృతి, ఒకే చట్టానికి వ్యతిరేకం అని.. మతతత్వం, జాతీయవాదం ఎప్పటికీ కలిసి ఉండవని ఆయన అన్నారని తెలిపారు. మహాత్మా గాంధీ స్వయంగా నెహ్రూను ప్రశంసించారని, నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని చెప్పారని స్టాలిన్ అన్నారు.