Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ రాహుల్ తెలిపారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై యూరప్, అమెరికా మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం రద్దైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్ ను అవమానించడమేనంటూ కాషాయ పార్టీ నేతలు విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భారత ప్రజాస్వామ్యం, రాజకీయాలు, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారాని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
Read Also: Kerala Chief Minister: మనీష్ సిసోడియా అరెస్ట్‌పై ప్రధానికి కేరళ సీఎం లేఖ
“భారతదేశంలో ప్రజాస్వామ్యం రద్దయింది” అని లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య.. విదేశీ జోక్యాన్ని కోరుతూ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానపరచడమేనని అధికార బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యూరప్, అమెరికా జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరుతున్నారని, అది ఏ ప్రభుత్వమైనా మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనిపై ఖర్గే, సోనియా స్పందించాలన్నారు. నిన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలతో భారత్ లో ప్రజాస్వామ్యంపై విదేశాలు సందేహాలు వ్యక్తం చేసే పరిస్ధితులు వచ్చాయని బీజేపీ మండిపడుతోంది.