Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమైంది.మణిపూర్‌లోని తౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జెండా ఊపి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 67 రోజుల్లో 110 జిల్లాల గుండా 6,700 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను 2004 నుండి రాజకీయాల్లో ఉన్నానని, నేను మొదటిసారిగా భారతదేశంలోని పాలనా వ్యవస్థ కుప్పకూలిన రాష్ట్రానికి వెళ్లానని, మనం మణిపూర్ అని పిలిచే రాష్ట్రం గతంలో లాగా లేదు. కొంతకాలంగా మణిపూర్ రగులుతోంది.. ఇంతవరకు ప్రధాని మోడీ మణిపూర్ రాలేదు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వివక్షకు మణిపూర్ ఉదాహరణ.. మణిపూర్‌కు గత విలువను, శాంతిని, గౌరవాన్ని తిరిగి తీసుకొస్తామని మాటిస్తున్నాం.. న్యాయ్ యాత్ర ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయ్ యాత్ర.. దేశంలో సంపద, వ్యాపారాలు ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లాయి.. ధరలు పెరగడంతో కష్టంగా మారింది.. అణగారిన బాధలను పట్టించుకునే వారు లేరు.. ఈ సమస్యలనే న్యాయ్ యాత్రలో మేం ప్రశ్నిస్తాం.” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Read Also: Ram Mandir Inauguration: రామమందిర వేడుకకు 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖుల రాక..
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ మతాన్ని రాజకీయాన్ని కలుపుతూ విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. ప్రధాని మోడీ ఓట్లను అడిగేందుకు వచ్చారు.. కానీ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాలేదని ఆయన విమర్శించారు. రాహుల్ యాత్రతో దేశానికి ఏం ప్రయోజనమని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశమని ఖర్గే వెల్లడించారు.
మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 15 రాష్ట్రాల మీదుగా 66 రోజుల పాటు సాగనుంది. మార్చి 21 వరకు కొనసాగి ముంబైలో ముగియనుంది. దాదాపు 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా ఈ యాత్రను ప్లాన్ చేశారు. ఈ యాత్ర మొత్తం 6,713 కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.