Jammu Kashmir: చలికాలాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కాశ్మీర్‌లో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారని చెబుతున్నాయి. 40 రోజుల అత్యంత కఠినమైన శీతాకాల దశ అయిన ‘‘చిల్లై కలాన్’’ సందర్భంగా భారత సైన్యం తీవ్రవాద నిరోధక ఆపరేషన్లను వేగవంతం చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఉపయోగించుకోకుండా ఉగ్రవాదుల్ని నిరోధించడానికి భద్రతను కట్టుదిట్టం చేసింది.
సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ల వల్ల ఉగ్రవాదులు కిష్ట్వార్, దోడాలోని ఎత్తైన, మధ్యపర్వత ప్రాంతాల్లోకి వెళ్లారని రక్షణ, నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఉనికి తక్కువగా ఉంటుంది. డిసెంబర్ 21న చిల్లై కలాన్ ప్రారంభమైనప్పటి నుండి సైన్యం తన కార్యాచరణ పరిధిని మంచుతో కప్పబడిన, ఎత్తైన పర్వత ప్రాంతాలకు విస్తరించింది. ఉగ్రవాదులపై నిరంతర ఒత్తిడిని కొనసాగించేందుకు సైన్యం ఫార్వర్డ్ శీతాకాల స్థావరాలు, తాత్కాలిక నిఘా పోస్టుల్ని ఏర్పాటు చేసింది.
ఉగ్రవాదులకు సురక్షితంగా ఉండే అడవులు, కొండలు, మారుమూల లోయల్లో క్రమం తప్పకుండా భద్రతా బలగాలు గాలింపులు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల్ని నివాసయోగ్యం కాని భూభాగాలకు పరిమితం చేయడం, వారి సరఫరా మార్గాలకు అంతరాయం కలిగించడం, జనాభా ఉన్న ప్రాంతాల వైపు వారి కదలికల్ని నిరోధించడం ఈ వ్యూహంలో లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫారెస్ట్ గార్డ్స్ మరియు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌తో దగ్గరి సమన్వయంతో ఆపరేషన్లు జరుగుతున్నాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రాండ్ సెన్సార్లు వాడుతున్నారు. వింటర్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన యుద్ధ విభాగాలు మోహరించాయి.