తమిళనాడులో తొలి విడతలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలు బరిలోకి దించాయి. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. అయితే విరుదునగర్ నుంచి గట్టి పోటీనే నెలకొంది. ఇక్కడ సినీ నటి రాధికా శరత్‌కుమార్, దివంగత నటుడు కెప్టెన్, విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ తలపడుతున్నారు. ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్‌లో రాధికా శరత్‌కుమార్ మొత్తం రూ.53.45 కోట్ల సంపద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక విజయ ప్రభాకరన్ రూ.17.95 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
రాధిక సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన దగ్గర రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు ఉన్నాయని.. అలాగే రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.
ఇటీవలే శరత్ కుమార్… ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అనంతరం విరుదునగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాధికా శరత్‌కుమార్ పేరును బీజేపీ వెల్లడించింది. ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
ఇక విరుదునగర్‌లో కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ బరిలో ఉన్నారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.17.95కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. రూ.2.50లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి ఆభరణాలు కలిపి రూ.11.38కోట్ల చరాస్తులు, రూ.6.57కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ.1.28కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు.
ఇక తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇక కోయింబత్తూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఎవరికి వారే విజయాలపై పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి:Chandrababu: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ.. యవతతో సమావేశంలో చంద్రబాబు