టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత జాతీయ స్థాయి నేతలతో సీఎం కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారని సమాచారం. పలు కార్యక్రమాల నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, పథకాలు, ఇతర అంశాలపై చర్చించారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్‌కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఆప్ నేతలు కూడా కేసీఆర్ కు బాసటగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. 24న పంజాబ్ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
Read Also: Harsimrat Badal: మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు
ఈ నెలలోనే బిఆర్ఎస్ విధి విధానాలు ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. ఈ నెలాఖరు కెల్లా 6 రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి భారత రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్). మహారాష్ట్ర, కర్నాటక, ఒడిసా సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిశాన్ సెల్ కమిటీలు ఏర్పాటవుతాయి.
Read Also: Special Millet Lunch: పార్లమెంట్‌లో ప్రత్యేక మిల్లెట్ లంచ్.. ఖర్గేతో కలిసి ఆస్వాదించిన ప్రధాని