Visakhapatnam Crime: చేసిన నేరాన్ని ఒప్పుకుని కోర్టులో లొంగిపోయేవాళ్లు కొందరు. నేరంచేసి పట్టుబడకుండా పరారీలో ఉండే వాళ్ళు కొందరు. అయితే నేరం చేసి పోలీసులకుపట్టుబడి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా.. శిక్ష నుండి ఎలా తప్పించుకు పారిపోవాలా అని చూసే వాళ్ళు కొందరు. నేరం చేయడం తప్పు.. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకుపోతే శిక్ష ఎక్కువ పడివుతుంది. అని తెలిసి కూడా కొందరు ఖైదీలు జైలు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. జైలు నుండి ఖైదీలు పారిపోయిన ఘటనలు గతంలో కూడా చూసి ఉంటాం. అలాంటి ఘటనే తాజాగా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Read also:Blockade of the Gaza: భూతల యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. గాజాలో ఇంటర్నెట్ కట్
వివరాలలోకి వెళ్తే.. చోడవరం మండలం లోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజు(31) అనే వ్యక్తి విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నాడు. కాగా నిందితుడిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఎలమంచిలి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో నిందితుడు తప్పించుకుని పరారైయ్యాడు. ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసులకి టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు నూకరాజు. ఎంత సేపటికి రాకపోయే సరికి అనుమానం వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు వెళ్లి చూడగా నిందితుడు కనిపించలేదు. దీనితో పిల్లా నూకరాజు కోసం ఎస్కార్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎంత వెతికిన నిందితుడు దొరకలేదు. దీనితో ఎస్కార్ట్ పోలీసులు ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.