Prisoner Escape: పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు. 2019 మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అఘాయిత్యం చేసిన కేసులో నిందితుడైన అతడిని సబ్ జైలులో ఉంచారు. సోమవారం ఉదయం రోజువారి పనుల్లో భాగంగా మహమ్మద్ పాషా జైలు ఆవరణలో ఉన్న చెత్తను జైలు బయట పడబోసి వస్తానని చెప్పడంతో జైలు అధికారి అతన్ని బయటకు పంపినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించిన మహమ్మద్ పాషా జైలు నుంచి పరారయ్యాడు.
Read Also: Errabelli Dayakar Rao: బండి సంజయ్ ఓ పిచ్చోడు.. రేవంత్ రెడ్డికి మెదడు లేదు..
సబ్ జైలు నుంచి పరారైన ఖైదీ మహమ్మద్ గౌస్ పాషా కామారెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో దొరికినట్లు పరకాల సబ్ జైలు అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పరారైన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జైలు అధికారులు అతన్ని పట్టుకోవడం కోసం పరకాల పట్టణాన్ని జల్లెడ పట్టారు. జైలు అధికారితో పాటు 8 మంది సిబ్బంది పరకాలతో పాటు ప్రధాన రహదారులను వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకొని గాలింపు చేపట్టారు. చివరకు పరకాల మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలోని లలిత కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. జైలు అధికారి ప్రభాకర్ రెడ్డితో పాటు 8 మంది సిబ్బంది అక్కడికి వెళ్లి అతని పట్టుకుని పరకాల సబ్ జైలుకు తీసుకొచ్చినట్ల తెలిపారు. అతడిని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పట్టుకున్నట్లు జైలర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.