ఫిబ్రవరి 5న హైదరాబాద్ నగరానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 న మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు. అక్కడ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ రామానుజచార్యుల విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధాని ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీజీ టీమ్ ఆశ్రమాన్ని సందర్శించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ అధికారులు.. ఆశ్రమంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అంతేకాకుండా ప్రధాని ఏయే ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుందనే వివరాలను కూడా సేకరించారు. ఈ క్రమంలోనే ఎస్పీజీ అధికారులు సెక్యూరిటీ పరంగా చిన్నపాటి సూచనలు చేసినట్లు తెలుస్తోంది.