ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ భారత క్రికెట్‌లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడకుండా బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటూ.. రంజీల్లో ఆడకున్నా హార్దిక్ పాండ్యాకు కాంట్రాక్ట్ లిస్టులో చోటు ఇచ్చింది. దీనిపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ బీసీసీఐ తీరును తప్పుపట్టాడు. ఆటగాళ్లందరినీ బోర్డు సమానంగా చూడాలన్నాడు.
ఓ యూట్యూబ్ షోలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దిగొచ్చాడా? అని బీసీసీఐని ప్రశ్నించాడు. ‘హార్దిక్ పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దొగొచ్చాడా?. హార్దిక్ కూడా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల మాదిరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సింది. అతడికి మాత్రమే ప్రత్యేక నియమాలు ఎందుకు?. కాంట్రాక్ట్ విషయంలో హార్దిక్‌ను కూడా బీసీసీఐ మందలించాల్సి ఉండే’ అని ప్రవీణ్ కుమార్ మండిపడ్డాడు.
Also Read: MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్.. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ..!
‘హార్దిక్ పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీలు ఆడితే చాలదు. మూడు ఫార్మాట్లలోనూ ఆడాలి. ఒకవేళ తాను టెస్టులకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకుంటే.. బోర్డుకు లేఖ సమర్పించాలి. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలి. ఒకవేళ హార్దిక్ టీ20 జట్టుకు మాత్రమే ఆస్తి అని బీసీసీఐ భావిస్తే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. బీసీసీఐ ఇలా వ్యవహరించింది కాదు. ఇదే విధానం పాటిస్తే పారదర్శకంగా ఉంటుంది’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. జాతీయ జట్టు తరఫున ఆడనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లంతా దేశవాళీ ట్రోఫీలలో ఆడాలని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే.