Chandrababu and Prashant Kishor Meet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు హాట్ టాపిక్‌గా మారిన ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం.. హైదరాబాద్ నుంచి నారా లోకేష్‌తో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పీకే.. లోకేష్ కారులోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. మూడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్ పాల్గొన్నారు.. అంతేకాకుండా.. ఇప్పటి వరకు టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ కూడా ఈ భేటీలో ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మూడు గంటలపాటు పీకే.. చంద్రబాబు సుదీర్ఘ భేటీ కంటే ముందే తెలుగుదేశం పార్టీ.. పీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.. దాదాపు మూడు నెలల క్రితం నుంచే పీకేతో టచ్ లో ఉన్నారట నారా లోకేష్.. గతంలోనే ఓ రెండుసార్లు పీకేతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం.
ఇక, ఈ రోజు చంద్రబాబుతో జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా పీకే చర్చించనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్ బాధ్యతలను ఇక నుంచి పీకే హ్యండిల్ చేసే అవకాశం ఉందంటున్నారు. తాను తెచ్చిన సర్వేల వివరాలను చంద్రబాబుకు వివరించారట పీకే.. ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల రూపకల్పనకు పీకే ప్రణాళికలు సిద్ధం చేశారట.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ కాంబినేషన్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై స్కెచ్ సిద్ధం చేస్తున్నారట ప్రశాంత్ కిషోర్.. మరోవైపు.. పీకే చేసిన సూచనలను ఇప్పటికే టీడీపీ అమలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇకపై పీకే గైడెన్స్‌లో రాబిన్ శర్మ టీం పనిచేస్తుందంటున్నారు.. రాబిన్ శర్మ గతంలో పీకే టీమ్‌లో పనిచేసిన వ్యక్తే.. దాంతో.. వారి కాంబోకి వచ్చిన ఇబ్బంది లేదంటున్నారు.. మొత్తంగా.. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.