AV Ranganath : ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన నల్గొండ జిల్లా మాజీ ఎస్పీ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది నిందితులకు కోర్టు శిక్ష విధించడంతో, తాము చేసిన దర్యాప్తుపై గర్వంగా ఉన్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాలపాటు దర్యాప్తు చేసి, కేసును ఛాలెంజ్‌గా తీసుకుని నిందితులకు శిక్ష పడేలా చేసామని ఆయన వెల్లడించారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనలసిస్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అన్ని ఆధారాలను సేకరించామని, 9 నెలలపాటు శ్రమించి 1,600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
కేసు విచారణలో భాగంగా 67 మంది సాక్షులను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు. కోర్టులో ఈ స్టేట్‌మెంట్లన్నీ చాలా కీలకంగా మారాయని, దర్యాప్తు పకడ్బందీగా సాగినట్లు తెలిపారు. ఈ కేసులో సాక్షాలు దొరకకపోయినా, సీసీ ఫుటేజ్ ద్వారా దృఢమైన ఆధారాలు సేకరించినట్లు రంగనాథ్ చెప్పారు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఒకే లక్ష్యంతో పని చేసి, నిందితులు తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా వెంటాడి పట్టుకున్నట్లు వివరించారు.
హత్యకు ప్రధాన సూత్రధారి మారుతీరావు, కూతురు అమృత తన ప్రేమ వివాహం చేసుకోవడంతో, తన పరువు పోయిందనే ఆగ్రహంతో కోట్ల రూపాయల సుపారితో హత్య చేయించాడని రంగనాథ్ వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితులుగా అక్బర్ అలీ, భారీ, అస్గరలి కీలకంగా ఉన్నారని, వీరిని పట్టుకుని విచారించామని తెలిపారు. హత్య అనంతరం నిందితులు ట్రైన్‌లో పారిపోడానికి ప్రయత్నించగా, మన పోలీస్ బృందాలు వెంటాడి పట్టుకున్నాయని పేర్కొన్నారు.
ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నామని, కానీ న్యాయాన్ని సాధించే దిశగా పకడ్బందీగా దర్యాప్తు చేశామని, ఈ రోజు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏవీ రంగనాథ్ అన్నారు. భవిష్యత్తులో హానర్ కిల్లింగ్ చేసినా శిక్ష తప్పదని ఈ కేసు రుజువు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
KTR : ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది