Pranay Case Judgement: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపింది.
ఇక ఈ హత్య ఘటనలో భాగంగా.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి, 2019 జూన్ 12న 1600 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. 5 సంవత్సరాల 9 నెలలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్షులను, పోస్టుమార్టం రిపోర్టులను, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లను పరిశీలించి తుది తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర డిప్రెషన్‌కు గురై, 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.