తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దుష్ట సంహారానికై అవతరించాడని, లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణలో అవినీతి, అబద్దాల పాలన నిర్మూలనకై పోరాటం ప్రారంభించామన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచంలో అన్ని ముఖ్య దేశాలు ఆర్థికంగా వెనుకబడితే భారత్ మాత్రం ఆర్థికంగా ముందుకు పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన ఉందని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Sajjala Ramakrishna: ఎవరైనా చంద్రబాబు భార్యని అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుందని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ టెండర్ అయినా గ్లోబల్ టెండర్ ద్వారా పనులను కేటాయిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో పనులను కేటాయిస్తుందని ఆయన అన్నారు. హెచ్సిసిఎల్‌కు 3 కోల్ మైన్ లు 2015లో కేటాయిస్తే రెండు మైన్ లు కేంద్రానికి తిరిగి ఇచ్చేశారన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పే కంపెనీ తయారు చేసుకున్నాడని, అవినీతి అబద్ధాలలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ పేర్లును జేసీఆర్, జేటీఆర్‌గా మార్చుకుంటే బాగుంటదన్నారు. అబద్ధాల ప్రచారం మానుకోవాలినీ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గరలో ఉందని కేసీఆర్‌ను హెచ్చరిస్తున్నామన్నారు ప్రహ్లాద్ జోషి.