Sajjala Ramakrishna Reddy Counter To Chandrababu Naidu: ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబే కాదు, ప్రజలు కూడా అనుకున్నారని.. అందుకే 2019లోనే ఆయన్ను, టీడీపీని సాగనంపారని కౌంటర్ వేశారు. దింపుడు కళ్లెం ఆశలా ప్రజల్ని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదని తేల్చి చెప్పారు. తనకోసం ప్రజలు ఉన్నారని చంద్రబాబు భ్రమ పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటికి పదిసార్లు తన భార్యను ప్రజల్లో చెప్పి, చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని చెప్పారు. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు.. ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు. లేనివన్నీ చంద్రబాబే ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు.
ప్రజల్ని విజ్ఞప్తి చేయడానికి బదులు.. తానే ముఖ్యమంత్రిగా వస్తానని చంద్రబాబు అనడమేంటి? అని సజ్జల రామకృష్ణా ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌పై కూడా సజ్జల ధ్వజమెత్తారు. హైవే పై లెక్కలేనితనంతో పవన్ వ్యవహరించాడని విమర్శించారు. అలాగే.. బీజేపీ నుంచి ఎవరు సాఫ్ట్ వైఖరి ఆశిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ దృష్టిలో ఉద్యోగులంతా సమానమే, గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకోవాలనే ధోరణిని కనబరిచాయని పేర్కొన్నారు. పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని.. ఉద్యోగులకు రాజకీయాలు వద్దని సీఎం స్పష్టంగా చెప్పారని సజ్జల వివరించారు.