Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారన్నారు. ఎన్నికలు పూర్తికాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు అన్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని గుర్తు చేశారు.

గతంలో యూపీఏ ప్రభుత్వం నయా పైసా పెంచక ముందే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుండే అని చెప్పారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటనలో పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి బంగారం కొనవద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే నడ్డివిరుస్తారని అనుమానం వచ్చిందన్నారు. ఆరు నెలల స్టాక్ ఉందని చెప్పారు. యుద్ధం కారణం చూపుతున్నారని.. యుద్ధం ఈరోజు రాలేదు.. ఇప్పటి నుండో ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి వ్యతిరేకిస్తున్నామని.. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరల మోత మోగింది. చమురు విక్రయ సంస్థలు (OMCs) పెంచిన ధరల కారణంగా మే 15న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని ప్రముఖ నగరాలన్నింటికంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నాయి. నగరంలో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ. 3.39 పెరగడంతో ప్రస్తుతం లీటరు ధర రూ. 110.89 కి చేరింది. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం రెండో స్థానంలో నిలిచింది. అక్కడ రూ. 3.37 పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ. 110.75 కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (రూ. 108.74), పాట్నా (రూ. 108.55), జైపూర్ (రూ. 108.19) నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 106 దాటి లీటరు రూ. 106.64 వద్ద విక్రయిస్తున్నారు.

పెట్రోల్‌తో పాటే డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పైపైకి దూసుకెళ్లాయి. లీటరు డీజిల్ ధర అత్యధికంగా తిరువనంతపురంలో రూ. 99.63 (రూ. 3.37 పెంపు) గా నమోదై, సెంచరీ మార్కుకు చేరువులో నిలిచింది. ఈ జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌పై రూ. 3.26 పెరగడంతో ధర రూ. 98.96 కి ముట్టింది. ఆ తర్వాత భువనేశ్వర్ (రూ. 96.11), చెన్నై (రూ. 95.47), కోల్‌కతా (రూ. 95.13)లు ఉన్నాయి. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 97.77 గాను, డీజిల్ ధర రూ. 90.67 గాను కొనసాగుతోంది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదల రవాణా రంగంతోపాటు సామాన్యుడి జేబుకు చిల్లుపడనుంది.