హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన పలు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాల పాలన, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వారికి కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
మంత్రిని కలిసిన వారిలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయడమే అత్యంత కీలకమైన అవకాశం. ఈ సమయంలో ప్రజలతో నేరుగా మమేకమైతే క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన వస్తుంది. ఈ అనుభవమే మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి గుర్తు చేశారు. ఈ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం , అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజాపాలనలో ‘ప్రజలే కేంద్రంగా’ పాలన సాగాలని మంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. “ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటూనే, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. అధికార యంత్రాంగం అంతా ఒక టీమ్‌లా కలిసి పనిచేసి, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆయన చెప్పారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపై పట్టు సాధించాలని ఆయన అధికారులకు సూచించారు.